నువ్వూ, నేనూ, ఆటిజం

నువు పుట్టుకతోనే
ఒక చిన్ని భూతాన్ని
వెంట తీసుకువచ్చావు

అవును, నాకు తెలుసు
ఆ భూతపు ఛాయలు
అప్పుడప్పుడు చూస్తూ వచ్చాను

పోగా పోగా
నేను చూస్తూ ఉండగా
ఆ భూతం నిను కొద్దికొద్దిగా
ఆక్రమించుకుంది

ఒక రోజు పొద్దునలేచి చూస్తే
నా ముందున్నది
నువ్వో నీ వెంట వచ్చిన భూతమో
తెలియని పరిస్థితి

నాకేదో అవుతుందన్న అయోమయం
ప్రేమార్తి, ద్వేషాగ్నుల కలగాపులగం

ఇంతా చేస్తే కన్నా
నీకింకా అప్పటికి
మూడున్నరేళ్లు
ఆలోపలే
నీ చుట్టూ
పొంచిఉన్న మాంత్రికులు
టీచర్లు బంధువులు
స్నేహితులు శాస్త్రజ్ఞులు

ఆ కల్లోల సాగర మధ్యంలో
తలవంచుకుని నాలోకి నేను
తొంగి చూసుకుంటే
నాతోపాటు భూమ్మీదికి వచ్చిన
రెండు మూడు భూతాలు
పలకరింపుగా చేతులూపి
ప్రశ్నార్థకంగా చూశాయి

తలయెత్తి చుట్టూ చూద్దును కదా
ప్రతి దివ్య పురుషుడి
కాంతి వలయాల నీడలో
పళ్ళికిలిస్తూ పిల్ల భూతాలు

అప్పుడర్ధమైంది నాకు
నువు కావాలంటే
ఆ భూతంతో కలిసి బతకాలి
ఆ భూతం వద్దనుకుంటే
నిను పోతే పొమ్మని
వదులుకోవాలి

కళ్ళనులుముకుని
నీకోసం వెదికితే
తప్పటడుగులో, తప్పుటడుగులో
పడుతూ లేస్తూ
నీ దారి పట్టుకు పోతూ నువ్వు,
నీ వెంట వచ్చిన భూతమూ

అప్పటినుంచీ
నీ దారిలో నీ వెనక
నీతో వస్తూ ఉన్నాను
మంత్రాలూ మాంత్రికులూ
టీచర్లూ శాస్త్రజ్ఞులూ
నీకు వాళ్ళకీ
మధ్యలో నేను

ఇప్పుడు చూద్దును కదా
నీ చుట్టూ కాంతి వలయాలు
ఆ కాంతిలో బాహాటంగా బహిరంగంగా
నీకూ భూతాలకూ బాహాబాహీలు
అందరూ నిను చూసి ఆహా ఓహోలు

విజయానికి సులువైన
మెట్లదారులు వెతికేవాళ్ళకి
చెప్పినా తెలుసుకోలేరు కానీ

“నీ బతుకు నీది నీ దారి నీది
నే ఉన్నన్నాళ్లు నీతో కలిసి
నడవడమే నేను చేయగలిగేది”
ఇది నాకు తెలిసిరావడమే
నీ విజయానికీ
నా సంయమనానికీ
మనం నడుస్తున్న దారిలో
ఆశలు చిగురించడానికీ
అసలు కారణం.

****

ఆటిజం గురించి:

ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ‘ఆటిజం’ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆటిజం నాడీ వ్యవస్థలో మార్పుల వల్ల కలిగే ఒక మానసిక స్థితి. దీనికి కారణాలు పూర్తిగా తెలియవు, కాబట్టి మందులు లేవు. పిల్లలకి రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఆటిజం ఉందని గుర్తించవచ్చు. బిహేవియరల్ థెరపీ ద్వారా పిల్లలకి కావలసిన ప్రవర్తన నేర్పడం ఇప్పటికి అందుబాటులో ఉన్న మార్గం.

రెండు నుంచి నాలుగేళ్ళ మధ్య వయసులో తమ కొడుక్కో, కూతురుకో ఆటిజం ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు పడే ఆవేదన, ఆందోళన వర్ణనాతీతం. నీ కట్టుబొట్టు వేరుగా ఉంటేనే నువ్వు నాకు శత్రువువి అన్నట్లు చూసే ప్రపంచంలో, నాడీ వ్యవస్థలు, జ్ఞానేంద్రియాల పనితీరు, మానసిక స్థితులు వేరుగా ఉండే పిల్లల్ని పెంచడం చాలా ఒత్తిళ్ళకు గురిచేస్తుంది. ఈ పిల్లలకి మాట్లాడడం, అనుకున్నది చెప్పగలగడం, కావాల్సింది అడగడం, తమ చుట్టూ ఉండే పెద్ద, చిన్న వాళ్లతో కలిసి ఉండగలగడం వంటివి – మిగతా పిల్లలు సహజ సిద్ధంగా నేర్చుకునే చాలా సామర్థ్యాలు – పనిగట్టుకుని నేర్పించాల్సి వస్తుంది. చాలా థెరపీలు అవసరమవుతాయి.

పిల్లలతో, పిల్లలకోసం ఎంతో సమయం, శ్రమ, డబ్బు పెట్టవలసి రావడం ఒక రకం కష్టం అయితే, తమ మీద, తమ పిల్లల మీద, భవిష్యత్తు మీద తాము పెంచుకున్న కలల్ని తిరిగి ఊహించుకుని, తమ జీవితాల్ని తిరిగి నిర్మించుకోవాల్సి రావడం ఇంకా పెద్ద కష్టం. చుట్టూ తాము ఊహించుకున్న సమాజమూ, ఆ సమాజపు పోకడలు, తమకి, తమ పిల్లలకీ సరిపడవని తెలుసుకుని, ఆ తర్వాత ఆ తెలివిడికి తగ్గట్లుగా పిల్లలకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుని, వాటి ప్రకారం బతకడం ఎంత కష్టమో ఊహించడం సులభమే.

ఇప్పటివరకూ ఇది తల్లిదండ్రుల గురించే. అంత చిన్న వయసు నుండి ఈ ఆవేదనలు, ఆందోళనలు, తుఫానుల నట్టనడుమ పెరుగుతున్న పిల్లలు ఎలా నెట్టుకొస్తున్నారనేది ఊహకు అందని విషయం.

అటువంటి ఒక పిల్లాడికి తండ్రిని నేను.

Advertisements

రచయితలూ రకాలూ…

రచయితలు, వారి రాతలు, రెండు రకాలు. అసలైతే చాలా రకాలు, కానీ ప్రస్తుతం రెండిటి గురించి మాట్టాడదామనుకుంటున్నా.

తాము చెబుతున్నదాన్ని దగ్గరగా చూసి, అనుభవించి, ఆనందమో, ఆవేదనో చెంది, దాని గురించి ఆలోచించి, ఇతరులతో అది పంచుకోవాలని తపన చెంది, రాసే వాళ్ళు మొదటి రకం. ఈ రకం రాతల్లో ఒక నిజాయితీ ఉంటుంది. మెదడుతో పాటు మనసు వాడి రాసిన ఆనవాళ్లు కనబడతాయి.

ఇక రెండో రకం ముఖ్యంగా బుద్ధి జీవులు. వారికి చాలా విషయాలు తెలుసు. వీరు ఆలోచిస్తారు. ఊహిస్తారు. ఒక నిశ్చయానికి వస్తారు. అక్కణ్ణుంచీ రాసుకుంటూ పోతారు. వీరి భావాలూ, వస్తువులూ చాలా వరకు అరువు తెచ్చుకున్నవే. కొన్నిసార్లు భాష కూడా అరువు తెస్తారు. వీరిలో కొందరు గొప్ప పండితులు, మహా మహా వేత్తలు ఉంటారు. చాలా శ్రమపడి వివరంగా రాస్తారు. సాము గరిడీలు చేస్తారు. అయితే వీటిలో మనసు తడి ఉండదు.

ఈ రెంటి మధ్య తేడా ఎటువంటిది? ఒకటి ఇంట్లో పప్పన్నం, రెండోది స్టార్ హోటల్లో దాల్-చావల్; ఒకటి మన ఊరికి సెలవలకెళ్లడం, రెండోది ఫారిన్ ట్రిప్పు.

నేనెందుకు హోం వర్కు చెయ్యలేదంటే…

కెన్ నెస్బిట్ అమెరికన్ పిల్లల కవి. ఆయన పిల్లల కోసం హాస్య కవిత్వం రాస్తాడు. పిల్లల ఊహల్లాగే ఈయన కవితలు కూడా నమ్మశక్యం కాని సంఘటనలు, అద్భుతమైన సన్నివేశాలతో మొదలయ్యి, చివరికి ఈ లోకంలోకి వస్తాయి. ఈయన కవితల్లో పిల్లలకి బాగా పరిచయమయిన సందర్భాలు ఎంచుకుంటాడు. చాలా కవితల్లో స్కూలు, రూల్సు, పెద్దవాళ్ళని అపహాస్యం చేస్తాడు.

All my great excuses అనే కవితకి అనువాదం ఇది.

నేనెందుకు హోం వర్కు చెయ్యలేదంటే…

నేను హోం వర్కు చేద్దామనే అనుకున్నా,
కానీ నా పెన్నులో ఇంకు అయిపోయింది.
మా పెంపుడు ఎలుక నా పుస్తకం తినేసింది
మా ఇంట్లోనేమో కరెంటు అసలే పోయింది

నా హోం వర్కు పుస్తకం చెయ్యిజారి
పొయ్యి మీద రసంలో పడి కరిగిపోయింది
నేను వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు
మా చెల్లి దాన్ని మురిక్కాలవలో పడేసింది

మా అమ్మ పనితొందరలో కంగారులో
నా హోం వర్కు శుభ్రంగా ఉతికి ఆరేసింది.
విమానం ఒకటి మా ఇంటిమీద కూలిపడి
నా హోం వర్కు ఆ మంటల్లో కాలిపోయింది

సుడిగాలికి నా నోట్సు కొట్టుకుపోయాయి.
మా ఊళ్ళో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి
మాయల మరాఠీ ముఠా చేతులో
అందమైన నా పుస్తకాలు బందీలయ్యాయి.

నా మీద ఒక షార్కు దాడిచేసింది
వేరే గ్రహం వాళ్లు నన్ను ఎత్తుకుపోయారు
బందిపోట్లు నా హోం వర్కు దొంగిలించి
తిరిగివ్వమంటే కుదరదంటున్నారు

పని తప్పించుకోటానికి మంచి సాకుకోసం
ఇంత కష్టపడి నేను వెతుకుతున్నానా,
చూడండి, మా టీచరమ్మ “ఒరే బుజ్జీ, దీనికన్నా
హోం వర్కు తేలికేమోరా” అని వెటకరించిది.

Kenn Nesbitt is an american children’s poet. He writes humourous poetry for children. His poems often include outrageous happenings before concluding on a realistic note, just like in the imagination of children. Many of his poems are set in contexts familiar to children and make fun of school, rules and grownups.

Here is the poem “All my great excuses”

I started on my homework
but my pen ran out of ink.
My hamster ate my homework.
My computer’s on the blink.

I accidentally dropped it
in the soup my mom was cooking.
My brother flushed it down the toilet
when I wasn’t looking.

My mother ran my homework
through the washer and the dryer.
An airplane crashed into our house.
My homework caught on fire.

Tornadoes blew my notes away.
Volcanoes struck our town.
My notes were taken hostage
by an evil killer clown.

Some aliens abducted me.
I had a shark attack.
A pirate swiped my homework
and refused to give it back.

I worked on these excuses
so darned long my teacher said,
“I think you’ll find it’s easier
to do the work instead.”

మొన్ననే ఒక పెళ్లిలో కలిశాం

“బాగున్నావా?” అని పలకరిస్తాన్నేను.
“ఆ, బాగున్నా. నువ్వూ?”, అంటావు.
జవాబు అవసరంలేని ఖాళీ ప్రశ్న అడుగుతూ.

నీ భుజం తడతాన్నేను
లేదా నువ్వు నా చెయ్యి పట్టుకుంటావు.
ఆ క్షణంలో పూర్వ సాన్నిహిత్యంతో కళ్లు మెరుస్తాయి.
“కూర్చో..ఆ, ఏంటి సంగతులూ?” అంటాన్నేను.
“ఏవుంది.. అంతా మామూలే”, కూర్చుంటావు నువ్వు.

ఈలోగా, గడిచిపోయి,
కాళ్ళ కింద నలిగి పడున్న కాలం,
ఆరిగామీ మడతలు విప్పుకుంటూ,
ఒళ్ళు విరుచుకుంటూ, ముళ్లపొదల కంచెలా
మనచుట్టూ లేచి నిలబడుతుంది.

పెళ్ళివాళ్ళు పెట్టుకున్న ఫోటోగ్రాఫరు
రెండు క్లిక్కులు తీసేస్తాడు
‘ఆత్మీయ ముచ్చట్లు’ అని టైటిలు పెడతాడు, తర్వాత.

“నువ్వు చెప్పు, ఎలా ఉన్నారు మీరందరూ?”
‎”ఆ..ఏవుంది, అంతా మామూలే..”

పంచుకోవాల్సింది చాలా ఉండి
సందేహిస్తావు నువ్వు.
‘మనకెందుకులే’ అనుకుంటాను నేను.

ఇంతలో నాకింకొక నువ్వు, నీకింకొక నేను.

“బాగున్నావా?” అని పలకరిస్తావునువ్వు.
“ఆ, బాగున్నా. నువ్వూ?”, అంటాన్నేను.

పదిరోజుల తర్వాత ఇంకోచోట
“ఫలానా వారు మీకు బాగా తెలుసటగా..” అంటారొకరు నీ గురించి.
“అవును..మొన్ననే ఒక పెళ్లిలో కూడా కలిశాం”
అంటాన్నేను, కొంత అసంతృప్తిగా…

అంతర్గతం

నా ఆనంద సామ్రాజ్యానికి
వాకిలివి నువ్వన్న భావనలో
నాకూ ఆనందానికీ మధ్య
నువ్వొక్కత్తివే అడ్డన్న భావం
ఎంతలేదన్నా అంతర్గతం.

కాల ప్రవాహంలో తేలుతూ మునుగుతూ
జారుతూ దొర్లుతూ, ఒకరికొకరు తగులుతూ
ముట్టుకుంటూ తట్టుకుంటూ ఒరుసుకుంటూ
గందరగోళంగా సగం జీవితం గడిపిన తర్వాత

గట్టిగా ఊపిరి బిగబట్టి
లోతులోకి దూకి
ఒక్క క్షణాన్ని దొరకబుచ్చుకుని
ఒకరినొకరం తడిమి చూసుకుంటే

ఎవరికి వాళ్ళం, ఒకళ్ళకి ఇంకొకళ్ళం
కల్పించుకున్న అస్పష్టమైన ఆకారాలు
తగుల్చుకున్న దెబ్బల తాలూకూ
మానిన మచ్చలు, ఆరని గాయాలు

ఒకరి గట్టితనం తగిలిన చోటల్లా
ఇంకొకరికి ఒళ్లునొప్పులు
కొద్దికొద్దిగా బీటలుపడుతున్న
ఒకప్పటి మధురభావాలు

అయితేనేం, మనం ఒకరికొకరం, ఒకరినొకరం,
ఒకరితో ఒకరం పొందింది ఆనందం
ఎలాగైనా కలిసి ముక్కలు కావలసిన వాళ్ళం
చెట్టాపట్టాలేసుకుని, పోదాం మళ్ళా ప్రవాహంలోకి.

 

ఓ కూనలమ్మా…

koonalamma

పూబోడి ఇంటిబాట
పున్నాగ పూలతోట
విరగబడి పూసెనట
ఓ కూనలమ్మా!

గుడిలో నైవేద్యము
చక్కనైన పద్యము
అనుభవైక వేద్యము
ఓ కూనలమ్మా!

కాలు జారిన చోట
నోరు వీడెను మాట
గొల్లు మన్నది పేట
ఓ కూనలమ్మా !

వేణువూదిన చోటు
రాధనొదిలిన చోటు
తీరనిది ఎడబాటు
ఓ కూనలమ్మా!

అతుకు పెట్టిన ‘బాస’
ఎరువు తెచ్చిన ‘గోస’
ఎందుకీ ఆభాస
ఓ కూనలమ్మా!

వేణువూదిన వాడు
రాధవీడిన రేడు
తిరిగిపోవగ లేడు
ఓ కూనలమ్మా!